Telangana
పదేళ్ల నిరీక్షణకు ముగింపు.. ఉద్యోగులకు ఎట్టకేలకు పదోన్నతుల శుభవార్త

తెలంగాణ ప్రభుత్వంలో కీలక నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. 2025 ముగింపునకు ముందే పలు శాఖల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించింది. దాదాపు పదేళ్లుగా ఎదురుచూపుల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో మొత్తం 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) కొత్త నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన డీపీసీ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన అధికారిక జీవోను ప్రభుత్వం ఒకటి లేదా రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ పదోన్నతుల్లో భాగంగా 23 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 14 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లు పదోన్నతి పొందనున్నారు. అలాగే, ఇద్దరికి అదనపు కమిషనర్లుగా, మరో ఇద్దరికి జాయింట్ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించనున్నారు.
షాఖలో పదోన్నతులు ఆలస్యం కావడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి తనిఖీల అధికారాలు ఉండటంతో, పై హోదాకు వెళ్లిపోయి ఆ అధికారాలు కోల్పోయే భయం ఉంది. ఈ కారణంతో కొందరు అధికారులు సంవత్సరాలుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. వారు ప్రమోషన్లు వద్దంటూ లేఖలు కూడా రాశారు. ఒక అధికారి తనకు ప్రమోషన్ వద్దని, ఇప్పుడు పనిచేస్తున్న జిల్లా నుంచి బదిలీ చేయొద్దని స్పష్టంగా లేఖ రాయడం అప్పట్లో చర్చించబడింది.
ఈ పరిణామాలతో కిందిస్థాయిలో ఉన్న సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లకు పదోన్నతులు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ శాఖలో ఇదే తొలి పెద్ద స్థాయి ప్రమోషన్ ప్రక్రియ కావడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖలో ఒక్క పదోన్నతి కూడా జరగలేదు, దాంతో ఉద్యోగాల్లో అసంతృప్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. అనేకసార్లు డీపీసీ సమావేశాలు జరిగాయి, కానీ తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇప్పుడు స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చడంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో హర్షం కనిపిస్తోంది. పదోన్నతులతో శాఖలో కొత్త ప్రేరణ నెలకొననుందని అధికారులు ఆశిస్తున్నారు.
#TelanganaExcise#ExciseDepartment#ExcisePromotions#RevanthReddyGovernment#TelanganaGovernment#DepartmentalPromotions
#DPCDecision#GovernmentJobs#ExciseOfficials#TSLatestNews