International
మోదీ–పుతిన్ భేటీ: చర్చల ద్వారానే శాంతి సాధ్యం అన్న మోదీ.. ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వైపు కదులుతున్నామన్న పుతిన్

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా రష్యా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఆ దిశగా తీసుకున్న ప్రతిపాదనలను భారత ప్రభుత్వంతో ఇప్పటికే పంచుకున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఇద్దరు నాయకులు ఉమ్మడి ప్రకటన చేశారు. సమస్యలు ఆయుధాలతో కాదు, చర్చలు-దౌత్యపరమైన మార్గాల ద్వారా పరిష్కారం కావాల్సిన అవసరాన్ని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
శుక్రవారం ఉదయం హైదరాబాద్ హౌస్‌లో పుతిన్-మోదీ సమావేశం జరిగింది. రెండు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. పుతిన్ తన ప్రత్యేక రక్షణ వాహనం ‘ఆరస్ సెనెట్’ను ఉపయోగించకుండా, మోదీ వ్యక్తిగత కారు లోనే ప్రయాణించడం ఇరువురు నేతల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధానికి గుర్తిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది. రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకోవడంపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా, భారత్ తన వాణిజ్య వ్యూహాన్ని మార్చలేదు. ఇదే సమయంలో అమెరికా కూడా రష్యా నుంచి అణు ఇంధనం కొనుగోలు చేస్తోందని పుతిన్ గుర్తుచేశారు. “అమెరికా కొనగలిగితే, భారత్ ఎందుకు కొనకూడదు?” అంటూ ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్శనలో రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించడం, బాహ్య ఒత్తిళ్ల నుంచి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రక్షించడం, అలాగే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల రంగంలో ఇరుదేశాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం.
#ModiPutinMeet #IndiaRussiaRelations #UkraineCrisis #DiplomaticTalks #GlobalPolitics #HyderabadHouse #EnergySecurity #IndiaForeignPolicy #RussiaIndiaFriendship #StrategicPartnership