ఒకప్పుడు “రూ.లక్షకే కారు” అనే నినాదంతో భారతీయ మార్కెట్లో సంచలనం సృష్టించిన టాటా నానో మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. టాటా మోటార్స్ తీసుకొచ్చిన ఈ మినీ కారుకు మొదట్లో మంచి ఆదరణ లభించినా, తర్వాత మార్కెట్ డిమాండ్ తగ్గడంతో 2018లో ఉత్పత్తిని ఆపేసింది. అయితే తాజాగా ప్రీమియం లుక్, అధునాతన ఫీచర్లతో నానోను తిరిగి మార్కెట్లోకి తీసుకురానుంది. కంపెనీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, టెస్టింగ్ మోడళ్ల ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
పునః ప్రవేశిస్తున్న నానో కార్ 624cc బీఎస్-6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని సమాచారం. ఇది లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. కొత్త నానోలో 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ గేరింగ్ వేరియంట్లు కూడా అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. వాహన ప్రీమియం లుక్, ఇంటీరియర్ డిజైన్‌తో ఆకట్టుకునేలా తయారవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.45 లక్షలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోసారి చిన్న కార్ల విభాగంలో టాటా సంచలనం సృష్టించగలదా అన్న ఆసక్తి ఇప్పుడు మార్కెట్లో నెలకొంది.