Telangana
కుమారి ఆంటీ గొప్ప మనసు.. ఈమె ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేలు విరాళం అందజేసింది

కుమారి ఆంటీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్లుండరు. ఆమధ్య.. సోషల్ మీడియాలో సునామీ సృష్టించి.. ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించిన కుమారి ఆంటీ.. ఈమధ్య కొంచెం సైలెంట్ అయ్యింది. అయితే.. ఇప్పుడు తన గొప్ప మనుసు చాటుకుని.. మరోసారి తెరపైకి వచ్చింది.
“హయ్ నాన్న.. మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా..” అంటూ సోషల్ మీడియాను ఉతికి ఆరేసిన కుమారి ఆంటీ.. ఇప్పుడు తన పెద్ద మనుసు చాటుకుంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో.. కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ వరదలకు భారీ నష్టం వాటిళ్లగా.. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు.. ఎవరికి తోచినంతలో వాళ్లు సాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి.. విరాళాలు వెల్లువెత్తుతున్న వేళ.. కుమారి ఆంటీ కూడా తన వంతు సాయాన్ని ప్రకటించారు.
వరద బాధితులకు తన తాహతకు తగ్గట్టుగా.. కుమారి ఆంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేలు విరాళం అందజేసింది. తన కుమార్తెతో కలిసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. ఆయనకే రూ.50 వేల చెక్కును అందజేసింది కుమారి ఆంటీ. ఆమె చేసిన సహాయాన్ని మెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీని శాలువాతో సత్కరించారు.
తాను చేసుకునే చిన్న వ్యాపారంతో.. కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి వరద బాధితులకు సాయం అందించి.. కుమారి ఆంటీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చేసింది చిన్న సాయమైనా.. సాయం చేయాలన్న పెద్ద ఆలోచన ఆమెను మరోసారి సెలెబ్రిటీల సరసన నిలబెట్టింది.
తన ఫుడ్ స్టాల్‌కు వచ్చే కస్టమర్లకు ఎలా అయితే ఆప్యాయంగా పలకరిస్తూ భోజనం వడ్డిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందో.. అదే మనసుతో కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసి.. తనలోని గొప్ప వ్యక్తిని ఈ సమాజానికి కుమారి ఆంటీ మరోసారి పరిచయం చేసింది. కష్టపడి బతకటమే కాదు.. కష్టంలో ఉన్నవారికి తహతకు తగ్గట్టుగా సాయం చేయాలనే సందేశాన్ని కూడా కుమారి ఆంటీ తెలియజేస్తోంది.