Andhra Pradesh

ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర కొండచిలువ.. అసలు ఏం జరిగిందంటే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి దగ్గరగా ఒక కొండచిలువ కనిపించింది. ఆ కొండచిలువ ఒక జంతువును మింగి, సమీపంలోని మీడియా పాయింట్‌ దగ్గర చనిపోయింది. వెంటనే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఆ కొండచిలువను అక్కడి నుంచి తీసి వెళ్లారు.కొద్దిరోజులుగా వర్షాలు పడుతుండటంతో పాములు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొండచిలువ కూడా ఇలా రోడ్డుపైకి వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.. ఆకలితో ఏదో జంతువును మింగడంతో ఇబ్బందిపడి చనిపోయింది అంటున్నారు.

పోలవరంతో పాటూ ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష
మరొక వైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు మరియు మరికొన్ని ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, సీఎం కార్యాలయ కార్యదర్శి రాజమౌళి, ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఈ సమీక్షలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రం వాల్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

మెయిన్ డ్యాం నిర్మాణ షెడ్యూల్‌ కాంట్రాక్టర్‌ కంపెనీ నుంచి ముందే తీసుకోవాలని.. కేంద్రం గడువుకు తగిన విధంగా పనులు పూర్తి చేయాలన్నారు. దీని కోసం మేఘా, బావర్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చిద్దామన్నారు సీఎం. పోలవరం తొలిదశలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.7,213 కోట్లు అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఓ వైపు ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే, మరోవైపు భూమి సేకరణ మరియు పునరావాసం కూడా చేయాలని చెప్పారు. చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో జలవనరుల సంరక్షణ కోసం సృజనాత్మకంగా ఆలోచించాలన్నారు ముఖ్యమంత్రి. ఎక్కడెక్కడ ఆర్థిక వనరులు కేటాయిస్తే సాగునీటిని ఎంత మెరుగుగా ఉపయోగించుకోవచ్చో ప్రణాళిక అవసరమని చెప్పారు. ఒక సంవత్సరం వరద నీటిని సరిగ్గా నిల్వ చేసుకుని, రెండేళ్ల పాటు కరవు వచ్చినా ఇబ్బంది లేకుండా సాగునీటిని ఉపయోగించుకునేలా ప్రణాళిక ఉండాలని అధికారులకు సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. వీటిని పూర్తి చేసేందుకు అవసరమైన వనరులపై చర్చించారు. పోలవరంతో పాటు హంద్రీనీవా కాలువలు, కుప్పం కాలువ పెండింగ్ పనులు, లైనింగ్, వెలిగొండ ప్రాజెక్టు, గోదావరి-పెన్నా అనుసంధానం, చింతలపూడి ఎత్తిపోతల, వంశధార రెండో భాగం రెండో దశపై ప్రధానంగా చర్చించారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణకి ప్రతి ఏడాదికి రూ.983 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిపి రూ. 275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పంట కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version