Connect with us

Telangana

36 రోజుల తర్వాత..! జైలు నుంచి బయటికి వచ్చిన జానీ మాస్టర్..

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని.. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఇటీవల బెయిల్ ఇవ్వడంతో.. ఈరోజు చంచల్‌గూడ జైలు నుంచి బయటికి వచ్చారు. తెలంగాణ హైకోర్టు.. గురువారం బెయిల్ ఇవ్వగా.. ఈరోజు బెయిల్‌పై బయటికి వచ్చారు. తన వద్ద పనిచేసే మైనర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ కొన్నిసార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలతో.. బాధితురాలు ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు పంపించారు.

అవకాశాల పేరుతో తనను బెదిరించి జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశారని ఆయన దగ్గర పనిచేస్తున్న డ్యాన్సర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.. పోయిన నెల 19వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి.. చంచల్‌గూడ జైలుకు పంపించారు. తాజాగా జైలు నుంచి బయటికి వచ్చిన జానీ మాస్టర్.. జైలు జీవితాన్ని నేర్పించిందని పేర్కొన్నారు.

జానీ మాస్టర్‌తో పాటు ఆయన భార్య పేరును కూడా బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పింది. 2019లో తాను మైనర్‌గా ఉన్నప్పటి నుంచే తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశారని సదరు యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. ఇక తనపై పోక్సో కేసు నమోదు కావడంతో కనిపించకుండా పోయిన జానీ మాస్టర్‌ను పోలీసులు.. గాలింపు చేపట్టి.. గోవాలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించి కోర్టులో ప్రవేశపెట్టగా.. మొదట 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత రిమాండ్‌ను మళ్లీ పొడగించగా.. తాజాగా బెయిల్ లభించింది.

ఈ అత్యాచార కేసు.. జానీ మాస్టర్‌కు కెరీర్ పరంగా బిగ్ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్‌ను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారని వార్తలు రాగా ఆయన జైలులో ఉండటంతో ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని గురువారం పుష్ప 2 టీమ్.. ప్రెస్‌మీట్ పెట్టగా.. నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇక జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో జనసేన పార్టీ ఆయనకు షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఇప్పటికే ఆ పార్టీ నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక మా అసోసియేషన్ కూడా జానీ మాస్టర్‌పై సస్పెన్షన్ విధించింది. ఇక జానీ మాస్టర్‌కు రావాల్సిన నేషనల్ అవార్డు కూడా రద్దు చేయడం గమనార్హం. మొదట జానీ మాస్టర్‌కు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును వచ్చింది. దీంతో ఆ అవార్డును తీసుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ పెట్టుకున్న విజ్ఞప్తికి అంగీకరించిన కోర్టు.. అక్టోబర్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో.. ఈ నేషనల్ అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Loading