Business
IPO అంటే ఏమిటి?
IPO అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. దీన్ని తెలుగు మాటల్లో చెప్పాలంటే — ఒక ప్రైవేట్ కంపెనీ మొదటిసారిగా ప్రజలకు (పబ్లిక్కి) తన షేర్లను అమ్మడమే. అంటే, ఈ కంపెనీ ఇప్పటివరకు కొందరు మాత్రమే కలసి నడుపుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్లు ఆ కంపెనీలో భాగస్వామ్యం (ఒక భాగం) ప్రజలకు అమ్మాలని నిర్ణయిస్తారు. దీనివల్ల ఆ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్టవుతాయి.
ఒక కంపెనీ అభివృద్ధి చెందేందుకు చాలానే డబ్బు అవసరం అవుతుంది. కొత్త ప్లాంట్లు నిర్మించాలి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి, మార్కెటింగ్ ఖర్చులు చేయాలి. ఇవి అన్నీ చేయడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం. అప్పుడే కంపెనీ IPO తీసుకొస్తుంది. అంటే – ప్రజల నుంచి డబ్బు తీసుకుని, దానికి బదులుగా షేర్లు ఇస్తుంది. ఈ షేర్లతో ప్రజలు ఆ కంపెనీ భాగస్వాములవుతారు.
ఒక మంచి రెస్టారెంట్ ఉందనుకోండి. అది చాలా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు ఆ రెస్టారెంట్ మరో 100 చోట్ల బ్రాంచ్లు పెట్టాలనుకుంటోంది. అయితే దానికి పెద్దగా డబ్బు కావాలి. అప్పుడే వారు IPO ద్వారా ప్రజల వద్ద నుంచి డబ్బు సమీకరించి, వాటికి బదులుగా తమ కంపెనీలో వాటా ఇస్తారు. ఇప్పుడు మీరు కూడా ఆ కంపెనీకి సహ యజమానులవుతారు.
ఒకసారి IPO జరగాక, ఆ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుతుంది. అంటే, ఇప్పటిదాకా ఒక ప్రైవేట్ కంపెనీగా ఉన్నది, ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చింది. ఇకపై ఆ కంపెనీ పని తీరును, లాభనష్టాల వివరాలను ప్రజలతో పంచుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది.