Education
HYD: నకిలీ వెబ్సైట్లను గుర్తించడంపై ముందడుగు
హైదరాబాద్‌లో సైబర్ సెక్యూరిటీ విభాగం కీలకమైన అడుగు వేసింది. సైబర్ క్రైమ్‌లను అరికట్టే దిశగా నిర్వహిస్తున్న CipherCop-2025 హ్యాకథాన్‌ను బుధవారం ప్రారంభించినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి హ్యాకథాన్ మొదటిసారిగా జరుగుతుండటం విశేషమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యువ మేధావులు, టెక్ఎక్స్పర్టులు కలిసి డిజిటల్ మోసాలపై సవాళ్లు స్వీకరించనున్నారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో జరిగే అక్రమాలను గుర్తించడం, నకిలీ వెబ్సైట్లు, స్కామ్ యాప్‌లు, మోసపూరిత డిజిటల్ కంటెంట్‌ను వెలికితీయడంపై దృష్టి సారించనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ హ్యాకథాన్‌లో విజేతలకు ప్రత్యేక అవార్డులు అందజేయనున్నారు.
పోలీస్ టెక్నాలజీ మిషన్ ప్రేరణతో ఈ హ్యాకథాన్ నిర్వహించబడుతోందని అధికారులు చెప్పారు. సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి పోటీలు కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తాయని, భవిష్యత్‌లో పోలీసులకు మరింత సహాయకారిగా మారతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.