Telangana

దీపావళి స్పెషల్‌ భాగంగా భాగ్యలక్ష్మీ ఆలయంలో వెండి నాణేలు పంచారు, భక్తులు ఎగబడ్డారు..

పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పండుగ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ట్రస్టీ ఆధ్వర్యంలో భక్తులకు వెండి నాణేలను పంపిణీ చేశారు. ఏడాదంతా అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో నాణేలు తయారుచేసి.. దీపావళి రోజు భక్తులను వాటిని అందజేస్తారు. ఈ రీతీ కొన్నేళ్లుగా కొనసాగుతోందని ఆలయ ట్రస్టీ శంభు తెలిపారు. అమ్మవారి రూపం ఉన్న వెండి నాణేల కోసం భక్తులు భారీగా రావడంతో ఆ ప్రాంతం జనంతో నిండిపోయింది.

వెండి నాణేలను అందుకోడానికి హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. ఇవి తమ అదృష్టాన్ని తెస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి ఏడాది భక్తులు నాణేలు పొందడాన్ని అదృష్టంగా భావిస్తారు.

ఈసారి కూడా దీపావళి రోజున భాగ్యలక్ష్మీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయం వద్ద అయోధ్య ఆలయానికి నమనుగా చేసిన అలంకరణ అందరినీ ఆకర్షించింది. ఈ అద్భుతమైన డెకరేషన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. సంతోషం వ్యక్తం చేసిన భక్తులు.. ఆలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు చార్మినార్, భాగ్యలక్ష్మీ దేవి దర్శనంతో పాటు అయోధ్య ఆలయాన్ని చూసిన అనుభూతి కలిగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడమైన చార్మినార్.. దానిని అనుకుని భాగ్యలక్ష్మీ ఆలయం ఉంటాయి. ఈ రెండు కట్టడాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ ఆలయానికి అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు వచ్చి దర్శించుకుంటారు. ముఖ్యంగా బీజేపీ నేతలు తరుచూ ఈ గుడికి వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కాగా, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అనే విషయంలో స్పష్టమైన ఆధారాల్లేవు కానీ, ప్రాచుర్యంలో ఉన్న ఓ కథ ప్రకారం.. ఓ రోజు చార్మినార్ దగ్గర కాపలాదారులు ఉండగా. అప్పుడే లక్ష్మీదేవి నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. ఆమెను కాపలాదారులు అడ్డగించడంతో దేవి తన గురించి చెప్పి, లోపలికి పంపాలని కోరారట. అనుమతి కోసం వారు రాజు దగ్గరకు వెళ్ళుతూ, తాము తిరిగి వచ్చే వరకూ అక్కడే ఉండాలని అమ్మవారికి చెప్పారు. వారు తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంటానని అమ్మవారు మాట ఇచ్చారట. ఇక, కోటలోకి వెళ్లిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారట.

తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి నాటి ప్రభువు అనుకున్నారట. ఆమె తిరిగి వెళ్లిపోతే రాజ్యంలో సిరిసంపదలు మాయం అవుతాయని, వెనక్కి పంపకుండా ఉపాయం ఆలోచించారట. ఆ కబురు తెచ్చిన కాపలాదారులు వెనక్కి వచ్చే వరకూ దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి, వారిని పంపకుండా రాజు అక్కడే ఆపేశాడట. దీంతో అమ్మవారు అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుందట. ఇది భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారి గురించి పాపులర్‌గా ఉన్న కథల్లో ఒకటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version