Andhra Pradesh

ఏపీలో మందుబాబులకు పండగే.. రూ.99కే లిక్కర్, కొత్త మద్యం పాలసీ వివరాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఖరార చేసింది. రెండేళ్ల కాల పరిమితితో (ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30) ఈ విధానం అమల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేశారు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.. అంతేకాదు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వెసులుబాటు ఉంది. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో షాపునకు రూ.2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

మద్యం షాపుల దరఖాస్తుల కోసం చెల్లించాల్సిన ఈ రుసుమును డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా, బ్యాంకు చలానా ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. డీడీ తీసుకెళ్లి నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందజేయాలి. ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ల నేతృత్వంలో.. ఈ నెల 11న మద్యం షాపులకు లాటరీ తీసి, లైసెన్సులు కేటాయిస్తారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్సుదారులు షాపుల్ని ప్రారంభించుకోవచ్చు. రాష్ట్రంలో కొత్త మద్య విధానం అమల్లోకి వచ్చేంత వరకూ ప్రస్తుతమున్న ప్రభుత్వ షాపులే కొనసాగుతాయి.

రాస్ట్రంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే ప్రాంతంలో జనాభాను బట్టి నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఉంటాయి. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు.. 50,001 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్‌ ఫీజు 65 లక్షలుగా ఉంటుంది. 5 లక్షలు దాటిన నగరాల్లో గరిష్ఠ ఫీజు రూ.85 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులను ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు.. అలాగే లైసెన్స్‌ ఫీజులతో పాటుగా వారికి ఇచ్చే మార్జిన్‌ను ఈసారి రెట్టింపు చేశారు. గతంలో 10శాతం ఉంటే ఇప్పుడు 20శాతం మార్జిన్‌ వ్యాపారులకు వస్తుంది.

రాష్ట్రంలో ప్రభుత్వం ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం షాపులకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు కూడా ఏర్పాటు చేస్తారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితితో.. లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటిగా నిర్ణయించారు. అంతేకాదు రాష్ట్రంలో మద్యం ధరల్ని కూడా తగ్గించారు.. రూ.99కే క్వార్టర్‌ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు. మరోవైపు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 మద్యం షాపుల్ని కేటాయించనున్నారు.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు తిరుపతిలో మద్యం షాపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి వరకూ (బస్టాండు, లీలామహల్‌ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం) ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. లీలామహల్‌-నందిసర్కిల్‌-అలిపిరి-ఎస్‌వీఆర్‌ఆర్‌ ఆసుపత్రి,-స్విమ్స్‌ వరకూ అనుమతి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version