Andhra Pradesh

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 ఏళ్ల తర్వాత వాటికి ఎన్నికలు..

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి సంఘాల ఎన్నికల కోసం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ, మధ్య, చిన్ననీటి పారుదల శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఓటర్ల సాగునీటి సంఘాల ఓటర్ల జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఉత్తర్వుల నేపథ్యంలో అధికారుల ఓటర్ల జాబితా రూపకల్పన, సవరణపై దృష్టిపెట్టారు. మరోవైపు నవంబర్‌లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు.

మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2015లో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాలను పట్టించుకోలేదు. అలాగే 2020లో సాగునీటి సంఘాల వ్యవస్థను రద్దు చేశారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావటంతో సీఎం చంద్రబాబు నాయుడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తం 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు, 6,149 సాగునీటి వినియోగదారుల కమిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి.

అయితే సాగునీటి సంఘాల ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి. మొదటి విడతలో నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ద్వారా ఆరుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆరుగురు డైరెక్టర్లలో నుంచి ఓ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడులను ఎన్నుకుంటారు. రెండో విడతలో నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కలిసి డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఎన్నుకుంటారు. మూడో విడతలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు కలిసి జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ కమిటీల పర్యవేక్షణలో డ్రైయినేజీ వ్యవస్థ, పూడికతీత, తట్టమట్టి తొలగింపు, పంట కాల్వల ఆధునీకరణ వంటి పనులు చేపడతారు. ఇలాంటి కీలకమైన సాగునీటి సంఘాలకు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటంతో రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version