Andhra Pradesh

అనంతపురం: రాములోరి రథానికి నిప్పుపెట్టిన దుండగులు..

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న క్రమంలో మరో ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో రామాలయం రథానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి రామాలయం ముందు ఉన్న రథానికి దుండగులు నిప్పుపెట్టారు. అర్ధరాత్రి సమయంలో మంటలను గమనించిన స్థానికులు వెంటనే వాటిని అదుపుచేశారు. అయితే అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది.

స్థానికుల సమాచారంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రథం కాలిపోయిన తీరుని పరిశీలించిన డీఎస్పీ రవిబాబు.. నిందితులను పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేశారు. రథం వద్ద నిందితులకు సంబంధించిన క్లూస్ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిందితులను అరెస్టు చేశాలని డిమాండ్ చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు… ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి విచారణ జరపాలని కలెక్టర్‌, ఎస్పీని సీఎం సూచించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణాలపై వీలైనంత త్వరగా నివేదిక అందించాలన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version