Andhra Pradesh

ఉచితంగా అన్న క్యాంటీన్‌లో భోజనం.. అక్కడ మాత్రమే!

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకున్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. ఆగస్ట్ 15న రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

ఆ తర్వాత ఇటీవలే సెప్టెంబర్ నెలలో మరో 75 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలు, కూలీలు, కార్మికులకు మూడు పూటలా భోజనం అందిస్తున్నారు. కేవలం ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ అందిస్తున్నారు. అలాగే ఐదు రూపాయలకే మధ్యాహ్నం సమయంలో భోజనం, రాత్రి వేళ డిన్నర్ సైతం పంపిణీ చేస్తున్నారు.

అయితే ఐదు రూపాయలు కూడా లేకుండా పూర్తి ఉచితంగా ఆహారం అందించే అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటైంది. ఇందులో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే మూడు పూటలా భోజనం చేయవచ్చు. ఇదెక్కడ ఉందని ఆలోచిస్తున్నారా.. ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటైంది.

రాయచోటిలో ఈ అన్న క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మూడు పూటలా ఉచితంగా ఆహారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ అన్న క్యాంటీన్ నిర్వహణను కార్యకర్తలు, టీడీపీ నేతల సహకారంతో నడుపుతామని.. ఏడాది పాటు ఉచితంగా ఆహారం అందిస్తామని ప్రారంభోత్సవం తర్వాత ప్రకటించారు. దీంతో మంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version