Andhra Pradesh
నైపుణ్య పోర్టల్‌ను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తాం: లోకేశ్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం ఒక కీలక ప్రకటన చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్. గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, సెప్టెంబర్ 1వ తేదీన ‘నైపుణ్యం పోర్టల్’ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగాలను ఆశించే యువతకు, ఉద్యోగాల కోసం వేటాడుతున్న కంపెనీలకు ఒక వేదికగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి. యువతను సాంకేతికంగా అభివృద్ధి చేసి, వారి ఉద్యోగార్హతను పెంపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా, ప్రైవేట్ కంపెనీలు ఏ నైపుణ్యాలు కోరుకుంటున్నాయో తెలుసుకొని, ఆ ప్రకారంగా శిక్షణ ప్రణాళికలు రూపొందించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంపై మాట్లాడిన ఆయన, “AI వల్ల ఉద్యోగాలు పోతాయని వార్తలు వస్తున్నాయి. కానీ మేం మార్పును అంగీకరించాలి. భవిష్యత్తును స్వీకరించి, మన విద్యార్థులను దానికి తగినట్లు సిద్ధం చేయాలి. అప్పుడే వారికి ఉద్యోగావకాశాలు కలుగుతాయి” అని అన్నారు. నైపుణ్యం పెరిగితేనే స్థిరమైన ఉద్యోగ భద్రత సాధ్యమవుతుందని మంత్రి నారా లోకేశ్ హితవు పలికారు.