Andhra Pradesh
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. వచ్చే ఆగస్టు 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్టు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
“రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అయినా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది” అని మంత్రి వెల్లడించారు.
ఈ పథకం అమలులో భాగంగా 6,700 బస్సులను ప్రత్యేకంగా మహిళల ప్రయాణానికి కేటాయించామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,950 కోట్లు వెచ్చించనుంది అని వివరించారు.
స్త్రీల ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛా గమనం, సామాజిక సాధికారతకు ఈ పథకం పెద్ద ఊతమిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.