హైదరాబాద్ నగరానికి మరొక ఆధునిక బస్ స్టేషన్ ఏర్పాటవుతోంది. ఆరాంఘర్ వద్ద కొత్త బస్టాండ్ నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డుమార్గ రవాణా సంస్థ (TSRTC) రూ.100 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 10 ఎకరాల భూమిని కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని RTC కోరింది. ప్రాజెక్టును జాతీయ స్థాయిలో నిర్మించేందుకు అన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన బస్సు టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ప్రయాణికులకు పార్కింగ్, ఫుడ్‌కోర్ట్, డిజిటల్ టికెటింగ్, గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ వంటి సౌకర్యాలను కల్పించనున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజలకు జూబ్లీ బస్ స్టేషన్ (JBS), విజయవాడ, ఖమ్మం, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మహాత్మాగాంధీ బస్టాండ్ (MGBS) సేవలు అందిస్తున్నాయి. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు అనుకూలమైన బస్టాండ్ లేదు. ఈ లోటును తీర్చేందుకు అతి త్వరలోనే ఆరాంఘర్ ప్రాంతంలో RTC ఆధునిక బస్టాండ్ నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తైతే నగరానికి దక్షిణాభిమానంలో బస్సు రవాణా మరింత వేగవంతం కానుంది.