Latest Updates
హైదరాబాద్ వాసులకు GHMC కొత్త వాట్సాప్ సేవలు – సమస్యలను వీడియో, ఫొటోలతో పంపండి!
హైదరాబాద్ నగర ప్రజలకు మరింత సౌకర్యంగా నగర నిర్వహణ సేవలను అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. ప్రజలు రోడ్లపై పేరుకుపోయిన చెత్త, బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేసిన నిర్మాణ వ్యర్థాలు వంటి సమస్యలను ఇకపై నేరుగా వాట్సాప్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు. ఈ సేవ ద్వారా ప్రజలకు ఫిర్యాదు చేయడం సులభమవుతోంది, అధికారులు స్పందన వేగంగా అందించగలుగుతున్నారు.
GHMC విడుదల చేసిన ప్రకారం, ‘8125966586’ అనే వాట్సాప్ నంబరును మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ప్రాంతంలో కనిపించిన చెత్త, నిర్మాణ వ్యర్థాల ఫొటోలు లేదా వీడియోలు తీసి, సమస్య ఎదురవుతున్న ప్రాంతానికి సంబంధించిన లొకేషన్ డిటైల్స్‌తో పాటు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. అధికారుల సిబ్బంది వీటిని స్వీకరించిన వెంటనే సంబంధిత ప్రాంతానికి చేరుకొని తక్షణమే శుభ్రత చర్యలు చేపడతారు.
ఈ కొత్త వాట్సాప్ సేవలు ప్రజల సహకారంతో నగరాన్ని మరింత శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్లు GHMC వెల్లడించింది. హైదరాబాద్ ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ పరిసరాల్లో కనిపించే సమస్యలను అధికారులకు ఫొటోలు, వీడియోల రూపంలో పంపించాలని కోరింది. నాణ్యమైన నగర జీవనానికి ఇది ఒక మెరుగైన ప్రయత్నంగా పరిగణించవచ్చు.