Environment
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం మళ్లీ ముంచే అవకాశముంది
హైదరాబాద్‌లో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర పరిపాలన యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. వాతావరణ శాఖ నుంచి హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైడ్రా అధికారులు సమన్వయంగా పని చేస్తున్నారు.
నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను క్లియర్ చేయడం, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. హైడ్రా సిబ్బంది ఫీల్డ్‌లో ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన ప్రతిస్పందన ఇస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు GHMC ఉన్నతాధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ టీములు ఇప్పటికే రంగంలోకి దిగాయి.
ఈ నేపథ్యంలో, ఎవరైనా వరద ముప్పును గమనించినా వెంటనే హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు. అతిక్రమణల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడే అవకాశమున్నందున ప్రజలు సహకరించాలని సూచించారు. అవసరమైతే 9000113667 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు.