Environment
హైదరాబాద్‌లో వర్షాల ముప్పు – తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై, వరద ముప్పు పొంచి ఉంది. స్కూళ్లకు రెండు రోజుల పాటు ఒంటిపూట బడి, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించడంతో పిల్లలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ, బయట పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
పిల్లలు హాఫ్ డే సాకుతో లేదా సెలవు సమయాన్ని ఉపయోగించుకుని స్నేహితులతో బయటకు వెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉందని తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. గతంలో కళాసిగూడలో చిన్నారి మౌనిక ఓపెన్ నాలాలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనను అధికారులు గుర్తుచేశారు. వర్షాల సమయంలో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక వరదలతో పాటు సీజనల్ వ్యాధుల ముప్పు కూడా పెరుగుతోంది. వర్షపు నీటిలో ఆడటం, తడిసిన బట్టలతో ఎక్కువసేపు ఉండటం వల్ల జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను షాపులకు లేదా చిన్న దూర ప్రయాణాలకు సైతం పంపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.