Environment
హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. ట్యాంక్‌బండ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం ప్రారంభమైంది. నగరంలోని కొన్ని చోట్ల జల్లులు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం నమోదైంది. రాత్రి 9 గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయం కలగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి చేరే సమయాల్లో వర్షం కురవడంతో ప్రయాణాలు కష్టతరమయ్యాయి. అందువల్ల వాతావరణ నిపుణులు ప్రజలు తమ ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఇక వర్షం తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మాన్సూన్ బృందాలు అలర్ట్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా చర్యలు తీసుకుంటూ, డ్రైనేజీ లైన్లు క్లీన్ చేయడం, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాలను సరిచూడడం వంటి పనులు చేపట్టాయి. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు.