Andhra Pradesh
స్కూళ్లకు మరోసారి మూడ్రోజులు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులకు మరోసారి వరుసగా మూడు రోజుల విరామం రానుంది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు హాఫ్‌డే సెలవు ఉంటుంది. ఆ తర్వాతి రోజు, అంటే ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ఉండటంతో పూర్తిగా సెలవు ఉంటుంది. ఆదివారం (ఆగస్టు 17) కూడా వస్తుండటంతో, విద్యార్థులు మూడు రోజులు వరుసగా విశ్రాంతిని ఆస్వాదించే అవకాశం దక్కనుంది.
ఇది విద్యార్థులకు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులకు కూడా కొంత ఉపశమనాన్ని కలిగించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం శుక్రవారం కావడంతో, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులకూ లాంగ్ వీకెండ్ లభించనుంది. ఈ సమయంలో చాలామంది కుటుంబ సభ్యులతో కలసి పర్యటనలు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. పండుగ ఉత్సాహం, సెలవుల ఆనందం కలగలసి ఈ మూడు రోజులు ప్రత్యేకంగా మారనున్నాయి.
ఇప్పటికే గత వారం వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఆదివారం వరుసగా మూడు రోజుల విరామం లభించిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితి మరోసారి రావడం విద్యార్థులకు, ఉద్యోగులకు రెండింతల ఆనందం కలిగిస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకునేలా ముందుగానే హోంవర్క్‌లు, ప్రాజెక్ట్ పనులు ఇవ్వడం జరుగుతోంది. పండుగ వాతావరణం, కుటుంబ సమాగమం ఈ రోజులను మరింత ఆహ్లాదకరంగా మార్చబోతున్నాయి.