Connect with us

Telangana

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు: తెలంగాణలో నక్సల్ ఉద్యమానికి ముగింపు ఘంటికా?

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు సందర్భంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం మరల చరిత్ర పుటల్లోకి చేరే దిశగా సాగుతోంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరిద్దరిపై వరుసగా రూ.25 లక్షలు, రూ.20 లక్షల రివార్డులు ఉండగా, ఈ లొంగుబాటు ద్వారా ఆపరేషన్ కగార్ విజయవంతమైందని అధికారులు భావిస్తున్నారు.

డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం సంతోషకరమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు అజ్ఞాతం వీడి ప్రజలతో కలిసి జీవించేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. చంద్రన్న గతంలో 15 ఏళ్ల పాటు కేంద్ర కమిటీలో సభ్యుడిగా, తెలంగాణ కమిటీ సెక్రటరీగా పనిచేసారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బలహీనమవడంతో ప్రజల మధ్యకివచ్చారని చెప్పారు.

లొంగిపోయిన పుల్లూరి ప్రసాద్ రావు మాట్లాడుతూ, మావోయిస్టు పార్టీలో చీలికలు ఏర్పడటం, అంతర్గత విభేదాలు పెరగడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని చెప్పారు. మావోయిస్టు ఉద్యమ భావజాలం ఎప్పటికీ తనలో మిగిలే ఉంటుందని, కానీ ప్రజా పోరాటాల దిశగా మార్గం మార్చుకున్నానని స్పష్టం చేశారు.

ఈ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన పునరావాస పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పోలీస్ శాఖ అవగాహన చర్యలు ఫలిస్తోన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామంతో మావోయిస్టు ఉద్యమం కొత్త దశలోకి అడుగుపెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Loading