Environment
భారత్ కు సునామీ ముప్పు లేదని స్పష్టం చేసిన INCOIS
రష్యా తీర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం నేపథ్యంలో సునామీ వచ్చే అవకాశం ఉందని గ్లోబల్‌గా ఆందోళనలు మొదలయ్యాయి. జూలై 29న రాత్రి 8.8 తీవ్రతతో రష్యా తూర్పు తీరంలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న అనేక దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది.
అయితే, భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) అధికారికంగా ప్రకటించింది. “భారత తీర ప్రాంతాల సమీపంలో భూకంప తీవ్రత గణనీయంగా లేదు. మేము సముద్రగర్భ లోతుల నుంచి ఎలాంటి ప్రమాదకర అలల మార్గాన్ని గుర్తించలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. భారత తీర ప్రాంతాల్లో పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలిపారు.
ఇంకొవైపు, అమెరికాలో నివసిస్తున్న భారతీయుల కోసం ఇండియన్ కాన్సులేట్ జనరల్ కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా వాషింగ్టన్, కాలిఫోర్నియా తీర ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, తీరానికి దూరంగా ఉండాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. అంతర్జాతీయ భద్రతా సంస్థలు కూడా సునామీ హెచ్చరికలను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో అమెరికాలోని భారతీయులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.