Environment
భారత్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం: నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. పహల్గామ్‌లో 26 మంది భారత పౌరులను ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి నిరపరాధుల ప్రాణాలను బలిగొన్న ఘోరమైన నేరమని, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
భారత్ రక్షణ వ్యవస్థ బలపరచడంలో ఇజ్రాయెల్ అందించిన సహాయాన్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్‌కు పంపిన ఆయుధాలు సమర్థవంతంగా పనిచేశాయని నెతన్యాహు వెల్లడించారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని, సాంకేతికత నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం వరకు సంబంధాలు విస్తరించనున్నాయని చెప్పారు.
ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఇరు దేశాలు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు నెతన్యాహు తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య భద్రతా సహకారం మరింత బలపడుతుందని, ఈ మైత్రి సంబంధాలు రెండు దేశాల ప్రజల భద్రతా పరిరక్షణలో కీలకంగా మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.