Latest Updates
బ్రేకింగ్ న్యూస్: బీఆర్‌ఎస్ నుంచి కవిత సస్పెండ్
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు విడుదల చేసిన ప్రకటనలో, కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించాయని, క్రమశిక్షణా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇటీవలి కాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరం వినిపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాయకత్వంపై నేరుగా విమర్శలు చేయడంతో పాటు, పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగ వేదికలపై ప్రశ్నించడం పెద్ద చర్చనీయాంశమైంది. దీనివల్ల ఇప్పటికే బీఆర్‌ఎస్ లోపల విభేదాలు బహిరంగమయ్యాయి.
ఇక నిన్న కవిత చేసిన ఆరోపణలు పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోశ్ రావు అవినీతికి పాల్పడ్డారని కవిత బహిరంగంగా ప్రకటించారు. దీంతో పార్టీకి ప్రతిష్టాపరమైన నష్టం జరిగిందని భావించిన బీఆర్‌ఎస్ అగ్రనేతలు చివరికి ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడానికి నిర్ణయం తీసుకున్నారు.