Environment
ప్రపంచంలో అతిపెద్ద భూకంపాలు: భూమి కంపించిన ఘోరమైన క్షణాలు
ప్రపంచ భూ చరిత్రలో కొన్ని భూకంపాలు తమ తీవ్రతతో కోట్లాదిమంది జీవితాలను మార్చేసాయి. వీటి లోకే అగ్రస్థానం సంపాదించుకున్న భూకంపం 1960లో చిలీలో చోటుచేసుకుంది. ఇది 9.4 నుంచి 9.6 తీవ్రతతో నమోదైంది. 1964లో అమెరికాలోని అలాస్కాలో 9.2 తీవ్రతతో భూమి కంపించింది. అలాగే 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల వద్ద 9.2-9.3 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీతో కలిపి లక్షల మందిని బలితీసుకుంది.
ఇందుకు తోడు 2011లో జపాన్‌లో టోహోకు ప్రాంతంలో సంభవించిన 9.1 తీవ్రత గల భూకంపం, ఫుకుషిమా అణుశక్తి ప్లాంట్ ప్రమాదానికి దారితీసింది. 1952లో రష్యాలోని కమ్చట్కా తీరంలో 9.0 తీవ్రత గల భూకంపం సంభవించింది. 2010లో చిలీలో బయోబియో ప్రాంతంలో 8.8 తీవ్రత గల కంపనం సంభవించగా, అదే స్థాయిలో 1906లో ఈక్వెడార్‌లోని ఎస్మెరాల్డాస్ దగ్గర భూమి కంపించింది.
ఇటీవల 2025లో రష్యాలోని కమ్చట్కా వద్ద మరోసారి 8.8 తీవ్రత గల భూకంపం భయానక అనుభూతిని మిగిల్చింది. 1965లో అలాస్కాలో 8.7 తీవ్రత గల భూకంపం సంభవించగా, 1950లో భారతదేశంలోని అరుణాచల ప్రదేశ్‌లో 8.6 తీవ్రత గల భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 2012లో సుమత్రాలో మరోసారి 8.6 తీవ్రతతో భూమి కంపించి ప్రజల్లో భయాందోళన కలిగించింది. ఈ తీవ్రత గల భూకంపాలు భూగర్భ అంతర్లీన చలనాలను ప్రతిబింబించడమే కాకుండా, వాటి ప్రభావం తరాలపాటు కొనసాగింది.