International
పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి పాకిస్థాన్‌లో బహిరంగంగా ప్రత్యక్షం
పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్ మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్థాన్‌లో బహిరంగంగా కనిపించాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కసూర్ ప్రాంతంలో పాకిస్థాన్ మర్కాజి ముస్లిం లీగ్ నిర్వహించిన భారత వ్యతిరేక ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించిన వీడియో బయటకు వచ్చింది.
ఈ ర్యాలీలో సైఫుల్లా కసూరి మాట్లాడుతూ, తనపై ఉగ్రదాడి నిందితుడిగా అన్యాయంగా ఆరోపణలు చేశారని వాదించాడు. “నా పేరును అన్యాయంగా ఈ ఉగ్రదాడితో ముడిపెట్టారు. కానీ, ఇప్పుడు నా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది” అని ఆయన వ్యాఖ్యానించాడు.
ఈ ఘటన పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన కార్యకలాపాలపై మరోసారి చర్చకు దారితీసింది. సైఫుల్లా కసూరి బహిరంగంగా కనిపించడం, అతడి వ్యాఖ్యలు భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.