Environment
పక్షులు మెచ్చిన హైదరాబాద్
హైదరాబాద్ నగరం పక్షులకు సైతం స్వర్గధామంగా మారింది. నగరవ్యాప్తంగా విస్తరించిన ఆహ్లాదకరమైన పార్కులు, ఆకుపచ్చని ప్రాంతాలు పక్షులకు ఆకర్షణీయమైన నివాసంగా మారాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి మరియు జులై నెలల్లో హైదరాబాద్ బర్డ్ అట్లాస్ (HBA) సభ్యులు నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నగరంలోని అనుకూల వాతావరణం కారణంగా 1,36,000 పక్షులు, 218 రకాల పక్షిజాతులు ఇక్కడ స్థిరపడినట్లు సర్వే తెలిపింది.
ఈ సర్వేలో సుమారు 225 మంది బర్డ్ వాచర్లు పాల్గొన్నారని, వారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పక్షుల కదలికలను, జాతులను గమనించినట్లు బర్డ్ వాచర్ కిశోర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని పచ్చని పార్కులు, సరస్సులు, వృక్షసంపద పక్షులకు సురక్షితమైన ఆవాసంగా మారడంతో, నగరం పక్షిప్రియులకు ఒక పరిశీలన కేంద్రంగా మారుతోంది. ఈ సర్వే ఫలితాలు నగర జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.