Environment
గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెన్ వండుతున్నారు..!
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఓమలూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతాల్లో గబ్బిలాలను వేటాడి వాటి మాంసాన్ని అక్రమంగా సేకరించిన గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. నాటు తుపాకులతో గబ్బిలాల వేట సాగిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి గబ్బిలాల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసాన్ని స్ట్రీట్ ఫుడ్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది.
ఇంతకీ గబ్బిలాల మాంసంతో ఏమి చేస్తున్నారనేగా మీ సందేహం! స్ట్రీట్ ఫుడ్ దుకాణాల నిర్వాహకులు ఆ మాంసాన్ని చికెన్ అని చెప్పి కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిల్లీ చికెన్, చికెన్ పకోడి వంటకాల్లో ఈ మాంసాన్ని ఉపయోగిస్తూ కస్టమర్లకు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇది పెద్ద ఆరోగ్య భద్రతా సమస్యగా మారింది. ఫారెస్ట్ శాఖ, ఫుడ్స్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై ముమ్మర విచారణ చేపట్టాయి.
అటవీ ప్రాణులను వేటాడటం నేరమే కాకుండా, గబ్బిలాల మాంసాన్ని మానవ వినియోగానికి విక్రయించడం ఆరోగ్యపరంగా తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాలు వహించే వైరస్‌లు, సూక్ష్మజీవులు ఇతరులకు సోకే అవకాశముందని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు వీలైనంత వరకు స్ట్రీట్ ఫుడ్ దుకాణాల్లో అనుమానాస్పదంగా ఉండే మాంసాహార పదార్థాలను తినడం తగదని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, అరెస్టు చేసిన ఇద్దరిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, గబ్బిలాల మాంస సరఫరా వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.