Environment
కామారెడ్డిని అతలాకుతలం చేసిన కుంభవృష్టి
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి విరజిమ్మి పట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. గంటలకొద్దీ కురిసిన వర్షం కారణంగా పట్టణంలోని చాలా ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ఎటు చూసినా నీరు నిండిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లల్లోనే ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతున్నారు. అత్యవసర సేవలు కూడా తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నాయి.
హౌసింగ్ బోర్డ్ కాలనీ, గోస్కె రాజయ్య కాలనీ వంటి ప్రధాన కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వరద ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వర్షం ప్రారంభమైన నిన్నటి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకటిలోనే గడపాల్సి వస్తోంది. తాగునీటి సరఫరా కూడా ఆగిపోవడంతో ఇళ్లలో అనేక ఇబ్బందులు తలెత్తాయి.
కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. భారీ వర్షానికి ఆ మార్గంలోని కల్వర్టు పూర్తిగా ధ్వంసమై వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పై వీడియోలో ప్రకృతి విధ్వంసం ఎంత భయానకంగా ఉందో కళ్లారా చూడొచ్చు.