Latest Updates
కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్సే: పల్లా
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ తరపున కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయాలపై ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేస్తూ, పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. కవితపై తీసుకున్న ఈ చర్యకు బీఆర్‌ఎస్ లోపల నుంచి బలమైన డిమాండ్ వచ్చిందని, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
అంతేకాకుండా, కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్సేనని పల్లా ఆరోపించారు. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ చెయ్యి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నానికైనా వెనుకాడదని, కుటుంబ విభేదాలను రెచ్చగొట్టి బీఆర్‌ఎస్ ను దెబ్బతీయాలనే వ్యూహం తీసుకువెళ్తోందని పల్లా ఎద్దేవా చేశారు.
“పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నం ఎవరైనా చేసినా చర్యలు తప్పవు” అని పల్లా స్పష్టం చేశారు. కవిత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడినట్లు తేలడంతోనే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. పార్టీ పటిష్టంగా ముందుకు సాగేందుకు కఠిన చర్యలు తప్పవని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.