Andhra Pradesh
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. పూర్తిగా ఫ్రీగా సేవలు, ఆందోళన అవసరం లేదు!
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం చేసిన భూ రీసర్వేలో ఎన్నో తప్పులు దొర్లినట్టు తేలింది. ఇప్పుడు ఆ తప్పులను సరిచేసి, రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న పాసుపుస్తకాల్లో కూడా ఏదైనా లోపాలు ఉంటే, వాటిని తప్పక సరిదిద్దుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
గతంలో జరిగిన రీసర్వేలో 6,688 గ్రామాల్లో సర్వే సరిగా జరగలేదని, అలాగే 4,783 గ్రామాల్లో భూహక్కు పత్రాల్లో విస్తీర్ణం, సర్వే నంబర్లు, పేర్లు, జాయింట్ ఎల్‌పీఎం, ఆధార్ వివరాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. అంతేకాదు, మరణించిన పట్టాదారుల స్థానంలో వారసుల పేర్లు చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
గత ప్రభుత్వ కాలంలో భూహక్కు పత్రాలపై రాజకీయ బొమ్మలు ముద్రించడం రైతుల్లో భయాందోళనలకు కారణమైందని మంత్రి విమర్శించారు. ప్రజల ఆస్తులను హరించే ఉద్దేశంతోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకువచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామసభల ద్వారా 7.50 లక్షల ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరిస్తూ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో కూడిన 22.33 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
ఈ వ్యవస్థలో రాష్ట్రవ్యాప్తంగా 1,68,688 ఎల్‌పీఎం నంబర్లను సరిదిద్దాల్సి ఉందని మంత్రి తెలిపారు. భూ రికార్డులలో గతంలో జరిగిన పొరపాట్లను పూర్తిగా సవరించి రైతులకు నమ్మకమైన పాసుపుస్తకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం గురించి స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు సరైన రెవెన్యూ రికార్డులను అందించాలని చూస్తోందని ఆయన తెలిపారు. అధికారులు కొత్త పాసుపుస్తకాలను ముద్రించే ముందు గ్రామసభల్లో భూమి వివరాలను రైతుల ముందు నిర్ధారించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
గ్రామసభలు పూర్తయిన తర్వాత కూడా రైతులు రీసర్వేలో తప్పులు ఉన్నాయని పిటిషన్లు పంపుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.
రైతులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. వారి ముందు సర్వే చేయలేదు. డేటా ఎంట్రీ కూడా సరిగా చేయలేదు. దీని వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయని మంత్రి వివరించారు.
ఇకపై ‘రీ సర్వే 2.0’ పూర్తిగా పారదర్శకంగా సాగుతుందని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. రైతులకు ముందుగా నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలోనే భూముల కొలతలు చేపడుతున్నామని తెలిపారు. రైతులు అందుబాటులో లేకపోతే వీడియో కాల్ ద్వారా కూడా సర్వే ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే రైతులు మళ్లీ రీసర్వేకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.
ఈ విధానం ద్వారా భూముల కొలతలు, రికార్డుల్లో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా రైతులకు పూర్తి న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
#APFarmers#PattadarPassbooks#LandResurvey#Resurvey2Point0#RevenueDepartment#FreePassbooks#LandRecordsCorrection
#FarmerWelfare#AndhraPradeshGovernment#AnaganiSatyaPrasad#ChandrababuNaidu#LandRights#TransparentGovernance#APNews
![]()
