Andhra Pradesh

ఏపీలో నకిలీ మద్యం కలకలం – యూట్యూబర్ అల్లాబకాష్ అరెస్ట్, కల్తీ లేబుల్‌ గుట్టు రట్టు

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా నంద్యాల జిల్లా గోస్పాడు మండలానికి చెందిన యూట్యూబర్ అల్లాబకాష్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం లేబుల్స్ తయారీలో ఇతని పాత్ర ఉన్నట్లు గుర్తించారు. బాధితుడిగా కాకుండా నిందితుడిగా నిలిచిన ఈ యూట్యూబర్‌ అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కోర్టు రిమాండ్ విధించడంతో అల్లాబకాష్‌ను జైలుకు తరలించారు.

ఇటీవలి కాలంలో అన్నమయ్య జిల్లా ములకలచెరువు, తంబళ్లపల్లె, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో నకిలీ మద్యం కేసులు వెలుగుచూశాయి. ఈ కేసుల దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే అల్లాబకాష్ పేరు బయటపడింది. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ మద్యం లేబుల్స్ తయారు చేయించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇందుకోసం నిందితులు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినట్లు విచారణలో బయటపడింది.

20 సంవత్సరాలు హైదరాబాద్‌లో చిన్నచిన్న పనులు చేసి, సంవత్సరం కిందట నంద్యాలకు తిరిగి వచ్చిన అల్లాబకాష్, యూట్యూబ్‌ జర్నలిస్టుగా పనిచేస్తూ ఈ నకిలీ మద్యం రాకెట్‌లో భాగస్వామి అయినట్లు పోలీసులు చెబుతున్నారు. విజయవాడలోని అతని నివాసంలో ఇటీవల ఎక్సైజ్ అధికారులు సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

ఇక నకిలీ మద్యం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వం తీసేసిన క్యూఆర్ కోడ్ విధానం కారణంగానే కల్తీ మద్యం మార్కెట్ పెరిగిందని విమర్శించారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ ‘ఏపీ సురక్షా యాప్’ ద్వారా నకిలీ మద్యం గుర్తించే విధానాన్ని ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version