Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర దారుణం.. 250 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లతో చంపేశారు
ఎన్టీఆర్ జిల్లాలోని వెలగలేరు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గ్రామంలోని వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లతో చంపి, రహస్యంగా పాతిపెట్టారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
జంతు సంరక్షణ సంస్థలు ఈ వ్యవహారంలోకి దిగడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. డిసెంబర్ 27న జరిగిన ఈ ఘటనలో గ్రామ పంచాయతీ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వీధి కుక్కలను చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామంలో కొన్ని రోజులుగా ఒక్క కుక్క కూడా కనిపించకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ విషయం జంతు సంరక్షణ సంస్థ దృష్టికి వెళ్లడంతో, వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కీలక ఆధారాలు సేకరించారు.
అనంతరం జి.కొండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పంచాయతీ సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యదర్శి ఉన్న సిబ్బందిపై కేసు నమోదు చేశారు. సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించి మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఈ చర్యలు చేపట్టారని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ విధానం ద్వారా స్టెరిలైజేషన్, టీకాలు వేయించడం చట్టబద్ధమైన మార్గం. కానీ వాటిని పక్కనపెట్టి, నిర్దాక్షిణ్యంగా చంపడం తీవ్రమైన నేరమని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మూగ జీవాల ప్రాణాల పట్ల చూపిన ఈ క్రూరత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన శిక్షలు విధించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
#NTRDistrict#VelagaleruVillage#StreetDogs#AnimalCruelty#JusticeForAnimals#StopAnimalKilling#AnimalProtectionAct
#DogLovers#SaveStreetDogs#APNews#PanchayatNegligence
![]()
