Education
ఉద్యోగంలో చేరితే రూ.15,000 ప్రోత్సాహకం – కేంద్రం కొత్త స్కీమ్ వివరాలు!
భారత యువతకు ప్రోత్సాహం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగంలో, కొత్తగా ఉద్యోగంలో చేరే వారందరికీ రూ.15,000 నగదు సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఈ పథకం పేరు “ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన” (PMVBRJY).
ఈ పథకంతో ప్రభుత్వ లక్ష్యం – యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, కంపెనీలపై ఉన్న వేతన భారం తగ్గించడం కూడా. అందుకే, కొత్తగా ఉద్యోగం ఇచ్చే కంపెనీలకు కూడా ప్రతి ఉద్యోగిపై నెలకు రూ.3,000 వరకు ప్రోత్సాహకంగా ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు. దీనివల్ల కార్పొరేట్ రంగం కూడా యువత నియామకాల్లో ముందడుగు వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ స్కీమ్ కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. రూ.1 లక్ష కోట్ల బడ్జెట్‌ను ఈ పథకానికి కేటాయించామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ప్రయోజనం కలిగించబోతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేట్ రంగ సంస్థలు, స్టార్టప్‌లు మొదలైనవి ఈ పథకానికి అర్హత కలిగిన ఉద్యోగులను నియమించుకుంటే, వారు ఈ స్కీమ్ ద్వారా ప్రోత్సాహక మొత్తాన్ని పొందవచ్చు. త్వరలోనే ఈ పథకం కోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్, దరఖాస్తు విధానం మొదలయ్యే అవకాశముంది. అర్హతల వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ తదితర సమాచారం త్వరలోనే అధికారికంగా విడుదల కానుంది.
ఇటువంటి యోజనల ద్వారా యువతకు భరోసా కలుగుతోందని, ఉద్యోగావకాశాలపై విశ్వాసం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి ప్రోత్సాహకంతో యువత ఉద్యోగాల కోసం మరింత ఉత్సాహంగా ముందుకు రావొచ్చు.