Connect with us

Andhra Pradesh

అమెరికాలో తెలుగు యువకుడి సత్తా – గూగుల్‌లో రూ.2.25 కోట్ల జాబ్ కొట్టిన సాత్విక్ రెడ్డి

గూగుల్‌లో రూ.2.25 కోట్ల ప్యాకేజీ సాధించిన తెలుగు యువకుడు సాత్విక్ రెడ్డి

అమెరికాలో మరోసారి తెలుగు యువకుడు ప్రతిభ చాటుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాత్విక్ రెడ్డి, గూగుల్‌లో ఏకంగా రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఈ ఘనతతో బీహార్ విద్యార్థి అభిషేక్ కుమార్ సృష్టించిన రూ.2.07 కోట్ల రికార్డును బద్దలు కొట్టాడు. సాత్విక్ సాధించిన ఈ విజయంతో తెలుగు యువత సత్తా ప్రపంచానికి మరోసారి తెలియజేశారు.

సాత్విక్ రెడ్డి, కొనుదుల రమేశ్‌రెడ్డి మరియు అంబిక దంపతుల కుమారుడు. ఆయన అమెరికాలోని న్యూయార్క్ స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే గూగుల్‌ నుంచి ఈ భారీ ఆఫర్‌ను అందుకున్నాడు. రోజుకు దాదాపు రూ.60 వేల సమానంగా ఉండే ఈ ప్యాకేజీతో సాత్విక్ ఇప్పుడు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో చేరబోతున్నాడు. స్థానిక ప్రజలు, మిత్రులు ఆయనను అభినందించారు.

టెక్ ప్రపంచంలో భారతీయులు తమ సత్తాను నిరూపిస్తున్న తరుణంలో, సాత్విక్ విజయవార్త మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM వంటి టెక్ దిగ్గజ సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉన్నారు. తెలుగు మూలాలు కలిగిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ప్రపంచాన్ని నడిపిస్తున్నారు.

ఇక తెలుగు యువత ప్రతిభపై ప్రపంచ టెక్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవలే విజయవాడకు చెందిన ఆరేపల్లి వెంకటసాయి ఆదిత్య అమెజాన్‌లో కోటిన్నర ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే ఈ భారీ ఆఫర్ రావడం భారతీయుల ప్రతిభను మరోసారి రుజువు చేసింది. అమెరికాలోని కఠిన వీసా పరిస్థితుల్లోనూ భారతీయులు వరుసగా జాబ్ ఆఫర్లు పొందడం గర్వకారణం.

Loading