Andhra Pradesh
మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ డిస్మిస్ చేసింది. ఇప్పటికే హైకోర్టులో ఆయనకు బెయిల్ నిరాకరణ లభించడంతో, చివరి ఆశగా మిగిలిన సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డికి అక్కడ కూడా చుక్కెదురైంది. దీని వల్ల ఆయన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం నెలకొన్నది.
ఈ కేసులో మిథున్ రెడ్డికి కీలకపాత్ర ఉందని, మద్యం పాలసీ రూపకల్పన నుంచి అమలుదాకా ఆయన ప్రత్యక్షంగా వ్యవహరించారని సీఐడీ కోర్టులో వాదించింది. పాలసీని సూత్రబద్ధంగా తయారుచేసినట్లు కనిపించినా, అంతర్గతంగా ముడుపులు చెల్లించిన కంపెనీలకే లైసెన్సులు, ఆర్డర్లు ఇచ్చేలా మార్పులు చేర్పులు జరిగాయని ఆరోపిస్తోంది. ఇదివరకే మాజీ మంత్రి పేర్ని నాని పేరును కూడా సీఐడీ ఈ కేసులో ప్రస్తావించింది. మొత్తం మీద రూ.2000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది.