Telangana
న్యూఇయర్ నైట్ ఫుల్ మజా.. మందు షాపులకు అర్ధరాత్రి వరకూ అనుమతి!

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం ఉత్సాహం చూపుతూ కీలక సడలింపులు ప్రకటించింది. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం. మరోవైపు శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
సాధారణంగా రాత్రి 10 గంటలకే మూసివేసే వైన్ షాపులకు ఈసారి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్‌లు, పర్యాటక హోటళ్లకు అర్ధరాత్రి ఒంటి గంట (1 AM) వరకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చింది. అధికారిక అనుమతి పొందిన న్యూ ఇయర్ ఈవెంట్లకూ ఇదే సమయ పరిమితి వర్తిస్తుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం హెచ్చరించింది. పబ్బులు, బార్లలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డాగ్ స్క్వాడ్ బృందాలను మోహరించారు. నిమిషాల్లోనే ఫలితాలు ఇచ్చే అత్యాధునిక డ్రగ్ టెస్టింగ్ కిట్‌లను సిద్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
డిసెంబర్ 31 రాత్రి నగరం అంతటా భారీగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వేడుకలకు వెళ్లే వారు ముందుగానే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని, ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను వినియోగించాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించే డ్యూటీ పెయిడ్ కాని మద్యంపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. నాటుసార, గంజాయి విక్రయాలపై స్పెషల్ టీమ్‌లతో దాడులు నిర్వహిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
ఈవెంట్లలో వినియోగించే సౌండ్ సిస్టమ్స్ నిర్ణీత డెసిబుల్ పరిమితిలోనే ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ శబ్దాలతో సంగీతం వినిపించకూడదని స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించే వారు స్థానికులకు ఇబ్బంది కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన పోలీసులు కోరారు.
#Telangana#NewYearCelebrations#NewYear2026#LiquorSaleTimings#ExciseDepartment#HyderabadPolice#DrunkAndDrive#RoadSafety
#DrugFreeCelebrations#DogSquad#PoliceAlert#PublicSafety#NightPatrol#LawAndOrder#CelebrateResponsibly