International
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు IND కోచ్ గా లక్ష్మణ్?
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు టీమ్ ఇండియా సిద్ధమవుతున్న వేళ, ఊహించని పరిణామంతో జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. తన తల్లికి గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు గంభీర్ స్వదేశానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లక్ష్మణ్ భారత అండర-19 జట్టు పర్యటనలో భాగంగా లండన్‌లోనే ఉన్నారు.
గంభీర్ తిరిగి ఇంగ్లండ్ చేరే వరకు వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా సన్నాహాలను పర్యవేక్షించి, జట్టుకు దిశానిర్దేశం చేయనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. జూన్ 20 నుంచి లీడ్స్‌లో మొదలయ్యే ఈ టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ జట్టు ఆడనుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో, ఈ సిరీస్‌పై అందరి దృష్టి నెలకొంది.