Andhra Pradesh
కాకినాడ జిల్లాలో కలకలం.. ముగ్గురు వ్యక్తుల దారుణ హత్య..!
కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ హత్యలకు దారితీసింది. కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒక మహిళ విషయమై.. రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై మరొక కుటుంబం కత్తులతో దాడి చేసారు. దాంతో ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజు మరణించారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హుటాహుటిన ఈ ఊరికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల్ని మోహరించారు. దీపావళి పండుగ రోజే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
కాకినాడలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
కాకినాడలో తల్లీకుమార్తెల ఆత్మహత్య కలకలం రేపింది. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది. నగరంలో జగన్నాథపురం పెంకేవారి వీధిలోని ఇంటి కింద అంతస్తులో సరస్వతి , ఆమె కుమార్తె స్వాతి నివాసం ఉంటున్నారు. సరస్వతి భర్త 16 ఏళ్ల క్రితం చనిపోగా.. పెద్ద కుమార్తెకు వివాహం కావడంతో విశాఖపట్నంలో ఉంటోంది. చిన్న కుమార్తె స్వాతి టైలరింగ్ పని చేస్తూ సరస్వతిని పోషిస్తూ ఉండేది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వారిద్దరు ఉంటున్న పోర్షన్ నుంచి దుర్వాసన రావడంతో పైఅంతస్తులో ఉన్నవారు గమనించి ఇంటి యజమానికి చెప్పారు. ఆయన పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఆ ఇంటి దగ్గరకు చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల సరస్వతి మంచంపై చనిపోయి ఉండగా.. స్వాతి ఉరివేసుకుని కనిపించింది. వెంటనే మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు. సరస్వతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో కుమార్తె స్వాతి మనోవేదనతో ఉన్నారు.. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లి ఏమైపోతుందోనని బాధతోనే ఇలా తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.
![]()
