International
సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై పాలస్తీనా మద్దతు నిరసన…90వేల మంది పాల్గొన్న భారీ ర్యాలీ
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ప్రసిద్ధ హార్బర్ బ్రిడ్జ్‌పై ఇజ్రాయెల్‌పై వ్యతిరేకంగా, గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనలో సుమారు 90,000 మంది పాల్గొని గాజా ప్రజలకు మద్దతు తెలుపుతూ సిడ్నీ వీధుల్లో నినాదాలతో మార్మోగించారు. మానవ హక్కులు, శాంతి, స్వేచ్ఛ కోసం తమ డిమాండ్లు వినిపిస్తూ, ర్యాలీలో వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతూ, ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ ఆకర్షించాయి. బ్రిడ్జి మీదుగా ఎగిసిపడుతున్న పాలస్తీనా జెండాలు, “ఫ్రీ గాజా” నినాదాలతో వేలాది మంది సిడ్నీ నగరాన్ని ఉద్యమ వేదికగా మార్చారు. పాల్గొన్నవారిలో స్థానికులు, విద్యార్థులు, ముస్లిం సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా యుద్ధాన్ని తక్షణం ఆపాలని, ఇజ్రాయెల్‌కి వ్యాపార ఆంక్షలు విధించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
అయితే, ఈ ర్యాలీలో పాల్గొన్నవారి సంఖ్య 90 వేల కంటే చాలా ఎక్కువగా ఉందని, ఏకంగా 3 లక్షల మందికి పైగా తరలివచ్చారని సిడ్నీలోని పాలస్తీనా యాక్షన్ గ్రూప్ పేర్కొంది. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే ఒక పెద్ద మానవహక్కుల నిరసనగా చర్చకు వచ్చింది. పాలస్తీనా ప్రజల పట్ల మానవీయ విధిగా ప్రపంచం స్పందించాలని, గాజాకు తక్షణ సహాయం అందించాలని వారు ప్రభుత్వాలను కోరారు.