Latest Updates
వీపున మోస్తూ తల్లికి ప్రపంచాన్ని చూపిస్తున్నాడు..
పుట్టగానే మనందరం ప్రపంచాన్ని మొదట అమ్మ ఒడిలో నుంచే చూస్తాం. అమ్మ ఒడిలోనే మొదటి చూపు, మొదటి నడక.. జీవితం అన్నిటికి ఆమెే తొలి గురువు. కానీ చైనాకు చెందిన చై వాన్బిన్ కథ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన చై వాన్బిన్.. తన జీవితంలో నిజమైన హీరో తాను కాదు, తన తల్లేనని గర్వంగా చెప్పుకునే వ్యక్తి. 88 ఏళ్ల వృద్ధ తల్లి.. వృద్ధాప్యంతో నడవలేని పరిస్థితి. కానీ ఆమెను ఇంట్లో వదిలేసి తన జీవితాన్ని సాగించడానికి చై హృదయం ఒప్పుకోలేదు.
తల్లిని ఒడిలో మోస్తూ తిరుగుతూ ఆమెకు ప్రపంచాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. పసి బిడ్డగా ఉన్నప్పుడు తల్లి తనను మోసినట్లు.. ఇప్పుడు తాను ఆమెను భుజాలపై మోస్తున్నాడు. చిన్నప్పుడు తనను పెట్టిన బేబీ స్లింగ్ మాదిరిగానే ప్రత్యేకమైన బెల్ట్‌తో తల్లిని మోసుకునే ఏర్పాటు చేసుకున్నాడు.
తల్లిని భుజాలపై మోస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని పర్వతాలపై నడవడం, మందిరాలను సందర్శించడం, కొత్త కొత్త ప్రదేశాలను చూపించడం చై వాన్బిన్కు సాధారణమైన విషయమే. “నాకు ప్రపంచాన్ని చూపించింది అమ్మే.. ఇప్పుడు అదే ప్రపంచాన్ని అమ్మకు చూపించడమే నా బాధ్యత” అని చెబుతున్నాడు.