Telangana
వరంగల్, హనుమకొండ స్మార్ట్ సిటీ పనులకు గ్రీన్ సిగ్నల్ – డిసెంబరే చివరి గడువు!

వరంగల్, హనుమకొండ జంట నగరాల్లో స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులకు మళ్లీ ఊపొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.150 కోట్ల విలువైన కొత్త పనులకు ఆమోదం తెలిపింది. అలాగే, గతంలో ఆగిపోయిన రూ.250 కోట్ల పనులను డిసెంబర్ 2025 చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
పెద్ద వడ్డేపల్లి చెరువు సుందరీకరణతో పాటు, పద్మాక్షిగుట్ట, ఎన్జీవోస్ కాలనీలలో లైటింగ్, గ్రీనరీ, డ్రైనేజీ పనులు వేగంగా జరగనున్నాయి. వరంగల్‌లోని పోతన రోడ్డు, పాపయ్యపేటల్లో నిలిచిన స్టోర్మ్ వాటర్ డ్రైనేజీ పనులను కూడా డెడ్‌లైన్‌కు ముందే పూర్తిచేయనున్నారు.
గ్రేటర్ వరంగల్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ బోర్డు సమావేశంలో, అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మిషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాత్‌వేలు, లైటింగ్, స్వాగత తోరణాలు, ఇతర శానిటేషన్ మౌలిక వసతులు ఏర్పాటుచేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ప్రత్యేకించి కరీమాబాద్, రంగశాయిపేట-ఉర్సు ప్రాంతాల్లో స్మార్ట్ రోడ్లు, గ్రీనరీ, ఫుట్‌పాత్ పనులు కీలకంగా మారాయి. పనుల వేగం పెంచేందుకు అధికారులు ఇప్పటికే యాక్షన్‌లోకి దిగారు.