Connect with us

Andhra Pradesh

భక్తుల భక్తి ఫలితం.. శ్రీవారికి మరో రూ.10 లక్షల భారీ విరాళం

తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు: అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.60 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల నుంచి వరుసగా భారీ విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ ట్రస్ట్‌లకు భక్తులు తమ శ్రద్ధాభక్తులతో విరాళాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు నగదు రూపంలో, మరికొందరు బంగారం, విలువైన వస్తువులు, వాహనాల రూపంలో స్వామివారికి కానుకలు అందజేస్తున్నారు.

తాజాగా టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.60 లక్షల విరాళం అందింది. ఆరుగురు భక్తులు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ఈ విరాళాన్ని సమర్పించడం విశేషం. బెంగళూరుకు చెందిన కె.ఎన్. నయన, వి. ప్రభ, ఎస్. రాజేష్, కె.ఎన్. సందీప్ కుమార్, అలాగే గుంటూరుకు చెందిన దేవరశెట్టి రితిష్, దేవరశెట్టి సత్యనారాయణ ఈ విరాళాలను అందజేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి రూ.60 లక్షలకు సంబంధించిన డీడీలను దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దాతల సేవాభావాన్ని ఛైర్మన్ కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భక్తుడు పొరూరి అనంత ఈశ్వర్ టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. అత్యవసర వైద్య సేవలకు ఉపయోగపడే ఈ ప్రాణదాన ట్రస్ట్‌కు అందిన విరాళం ఎంతో కీలకమని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో టీటీడీ అధికారులు భద్రతా, పరిపాలనా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీ&ఎస్వో మురళీకృష్ణ తదితర అధికారులు హాజరయ్యారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు ఈవో సూచించారు. డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సాధారణ సర్వదర్శనానికి రావచ్చని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.

రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతాల్లో స్పష్టమైన సమాచారం అందేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే రేడియో, సోషల్ మీడియా, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నపానీయాల సరఫరా, శ్రీవారి సేవకుల అందుబాటు, భద్రతా ఏర్పాట్లు సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల తరహాలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, టీటీడీ–పోలీసు శాఖల మధ్య వాట్సాప్ గ్రూప్ ద్వారా సమన్వయం పెంచాలని నిర్ణయించారు.

#Tirumala#TTD#TirumalaDonations#SVAnnaprasadamTrust#PranadanaTrust#VaikunthaDwaraDarshanam
#TirumalaUpdates#LordVenkateswara#DevoteesDonation#TTDNews#Tirupati

Loading