International
ప్రైవేట్ లీగుల్లో పాక్ పేరు వాడొద్దు: పీసీబీ స్పష్టం
ప్రైవేట్ టోర్నీల్లో పాకిస్థాన్ పేరును అనుమతి లేకుండా వాడకూడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టంచేసింది. ‘పాకిస్థాన్’ అనే పదాన్ని ఉపయోగించాలంటే, ముందుగా అధికారికంగా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొంది. ఎవరైనా తమ వ్యక్తిగత లాభాల కోసం పాక్ పేరు వినియోగిస్తే, దేశ కీర్తి, క్రికెట్ బోర్డు ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశముందని పీసీబీ ఆందోళన వ్యక్తంచేసింది.
ఇటీవల వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో భారత్ పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన ఘటన ఈ నిర్ణయానికి ప్రేరణగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇండియా లెజెండ్స్ జట్టు ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ లెజెండ్స్‌తో జరగాల్సిన రెండు మ్యాచ్‌లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున లెజెండ్ ఆటగాళ్లు పాల్గొనకపోవడం వల్ల టోర్నీ సమగ్రతపై ప్రశ్నలు తలెత్తాయి.
ఈ తరహా సంఘటనల వల్ల అంతర్జాతీయంగా పాకిస్థాన్ పేరు పరువు కోల్పోతుందని పీసీబీ భావిస్తోంది. తద్వారా ఇకపై ఎవరైనా తమ ప్రైవేట్ లీగ్‌లు, టోర్నీల్లో “పాకిస్థాన్” అనే పేరు వాడాలనుకుంటే, అధికారికంగా అనుమతులు తీసుకోవాల్సిందేనని ఖచ్చితంగా స్పష్టం చేసింది. అంతేకాక, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు బోర్డు కొత్త మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సమాచారం.