బోగస్ పెన్షన్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ పొందాలంటే లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అనుసరించాల్సిందే. ఈ నూతన విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి, నకిలీగా పెన్షన్ తీసుకుంటున్న వారిని తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫేస్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా ప్రతి నెలా లబ్ధిదారుల ఫొటో తీసి అదే యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే సంబంధిత పెన్షన్ లబ్ధిదారులకు వేతనాలు అందజేస్తారు. అధికారులు ఈ విధానాన్ని నిరంతరం పర్యవేక్షించి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు.
అంతేగాక, అన్ని పోస్టాఫీసుల్లో పెన్షన్ లబ్ధిదారుల వివరాలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల స్థానికంగా ఎవరెవరికి పెన్షన్ వస్తోందన్న విషయం స్పష్టమవుతుంది. తగిన ఫిర్యాదులు వచ్చినప్పుడు చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొత్తం మీద, డిజిటల్ సాంకేతికతను వినియోగించి పెన్షన్ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.