Andhra Pradesh
పెట్రోల్, డీజిల్‌పై GST ఆశలు ఆవిరి
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా అన్న అంచనాలకు షాక్ తగిలింది. GST శ్లాబులను తగ్గించే ప్రతిపాదనలతో ఇంధన ధరలపై ఉపశమనం దొరుకుతుందేమోనని ప్రజలు ఎదురుచూశారు. కానీ పెట్రోలియం ఉత్పత్తులను GST పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ఇష్టపడట్లేదని జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పన్నులు విధిస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సెస్ రూపంలో వసూలు చేసే ఈ పన్నులు కలిపి లీటర్ ధరలో 50% వరకు ఉంటున్నాయి. ఇదే కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడినా, దేశీయంగా పెద్దగా తగ్గింపులు జరగడం లేదు.
పెట్రోల్, డీజిల్‌ను GST పరిధిలోకి తేవడం వల్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉండేది. కానీ కేంద్రం, రాష్ట్రాలు పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడంలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇంధన ధరల తగ్గింపు కోసం ప్రజలు ఇంకా వేచి చూడాల్సిందేననే పరిస్థితి నెలకొంది.