Devotional
తెలంగాణ ముస్లిం ఉద్యోగులకు ఊరట: రంజాన్ మాసంలో గంట ముందే ఇంటికి వెళ్లే ఛాన్స్!
రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం ఉద్యోగుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, సాయంత్రం వేళ ఒక గంట ముందే విధులకు స్వస్తి చెప్పేలా ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వంలోని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డులు మరియు కార్పొరేషన్లలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.సాయంత్రం ఇఫ్తార్ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, సకాలంలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా గంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ముస్లిం ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఉపవాస దీక్షల సమయంలో ప్రయాణ ఇబ్బందులు తగ్గి, కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనే అవకాశం కలుగుతుందని వారు పేర్కొంటున్నారు.
![]()
