Connect with us

Andhra Pradesh

తిరుమలలో వీధుల పేర్ల మార్పు – వైకుంఠ ద్వార దర్శనం ముందు భక్తులకు కీలక అప్డేట్!

Tirumala Tirupati Devasthanams

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్ర నగరంలోని ప్రధాన వీధులకు శ్రీవారి అనన్య భక్తుల పేర్లు పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే అనేక గెస్ట్ హౌస్‌లకు దేవుని తతంగానికి అనుగుణంగా పేర్లు మార్చినట్లు తెలిసిందే. తాజా నిర్ణయం ప్రకారం తిరుమలలోని వీధులకూ ఆధ్యాత్మిక స్పర్శ కలిగించేలా కొత్త పేర్లు ఖరారు చేశారు.

పూర్వంలో ఉన్న మేదరమిట్ట, ఆర్‌బీ సెంటర్, ముళ్లగుంట వంటి సంప్రదాయ పేర్లపై చర్చ జరిగింది. పవిత్ర క్షేత్రం కావడంతో భక్తి భావనను ప్రతిబింబించేలా కొత్త పేర్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనితో శ్రీ అన్నమాచార్యులు, శ్రీ తిరుమలనంబి, శ్రీ వెంగమాంబ, శ్రీ పురందరదాసు, శ్రీ అనంతాళ్వార్, శ్రీ సామవై వంటి పరమభక్తుల పేర్లను వీధులకు ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు త్వరలో అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది.

ఇక విశ్రాంతి భవనాల పేర్ల విషయంలో కూడా టీటీడీ ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంది. దాతలు నిర్మించి దేవస్థానానికి అప్పగించిన 42 గెస్ట్ హౌస్‌లకు దాతల పేర్లు ఉండగా, వాటిని ఆధ్యాత్మికతను ప్రతిఫలించేలా మార్చారు. జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయానికి రాఘవ నిలయం, మైహోమ్ పద్మప్రియకు పద్మప్రీయ నిలయం, సుధాకృష్ణ నిలయానికి వైకుంఠ నిలయం, శ్రీ రచనకు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనానికి విరజా నిలయం అనే పేర్లు పెట్టారు. భవిష్యత్తులో నిర్మించే అన్ని భవనాలకు భగవంతుని నామమే పెట్టాలని బోర్డు తేల్చింది.

ఇక వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులు ఎదురుచూస్తున్న సమయానికి టీటీడీ తాజా అప్‌డేట్ విడుదల చేసింది. జనవరి 2 నుంచి 8 వరకు జరిగే దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు శ్రీవాణి కోటా టికెట్లు శుక్రవారం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. తొలి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా కేటాయింపులు పూర్తి కాగా, మిగిలిన రోజులకు నేటి ఉదయం 10 గంటలకు రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు విడుదల చేయనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15,000 చొప్పున రూ.300 దర్శన టికెట్లు విడుదల అవుతాయి. భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

#Tirumala #TTD #VaikuntaDwaram #TTDUpdate #TirupatiNews
#SrivariDarshan #TTDTickets #SpiritualIndia #HinduTemple
#Annamaiah #TirumalaDarshan #SpecialEntryDarshan #APNews

Loading