Andhra Pradesh
ఏపీలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం: 3.8 కి.మీ. అతి పెద్ద రన్‌వేతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ 2026 ఆగస్టులో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా నేషనల్ హైవేలు, పరిశ్రమలు, మరియు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిపై దృష్టి సారించింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణమవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో ఈ ఎయిర్‌పోర్ట్ దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా, 2026 ఆగస్టు నాటికి విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుంది.
ఈ సంవత్సరం జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో AAI (భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించబడింది. ఇందులో చిన్న విమానం ద్వారా రన్‌వే, సిగ్నల్ వ్యవస్థల సాంకేతిక పరీక్షలు చేపట్టారు. ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ట్రయల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం రన్‌వే, సిగ్నల్ సిస్టమ్, లైటింగ్ వంటి కీలక పనులు తుదిదశలో ఉన్నాయి.
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక, విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాలకు ఇది ప్రధాన కనెక్టివిటీ హబ్‌గా మారనుంది. నేషనల్ హైవేతో నేరుగా కనెక్టివిటీ కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల పర్యాటక మౌలిక సదుపాయాలను కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే 80 ఎకరాల తీరప్రాంత భూమిని పర్యాటక శాఖకు కేటాయించారు. ఇందులో 40 ఎకరాలు మై కేర్ సంస్థకు, మరో 40 ఎకరాలు ఒబెరాయ్ గ్రూప్‌కు అప్పగించబడినాయి. భోగాపురం, భీమిలి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టులు, మరియు కన్వెన్షన్ సెంటర్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
జీఎంఆర్ గ్రూప్ ఇప్పటికే రూ.500 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అదనంగా ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యం రూ.100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మిస్తోంది. రూ.150 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కూడా జరుగుతోంది. తాజ్ హోటల్ కూడా భీమిలి మండలంలో నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టులతో పాటు, చింతపల్లి తీరంలోని పాత టూరిజం కాటేజీల పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తికాగానే, భోగాపురం ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక మరియు వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందనుంది.